రూ.10 వేలు అన్నరు.. పైసా ఇవ్వలే..

రూ.10 వేలు అన్నరు.. పైసా ఇవ్వలే..

జనగామ జిల్లాలో ఇప్పటికీ అందని పంట నష్టపరిహారం
ఎదురుచూపుల్లో 20 వేల మందికిపైగా రైతులు
పట్టించుకోని ప్రభుత్వం

జనగామ, వెలుగు : పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామన్న సర్కార్‌‌‌‌ మాటలు అమలుకు నోచుకోవడం లేదు. గత యాసంగి సీజన్‌‌‌‌లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదు. స్వయంగా సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చినా అమలు కాకపోవడంతో రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి.

జనగామ జిల్లాలో 20 వేలకుపైగా బాధితులు

గత యాసంగి సీజన్‌‌‌‌లో అకాల వర్షాలకు తోడు వడగండ్లు పడడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. చేతికొచ్చిన వరి మొత్తం నీళ్లపాలైంది. ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆఫీసర్లు 10 రోజుల పాటు సర్వే చేసి బాధిత రైతుల లిస్ట్‌‌‌‌ను ఉన్నతాధికారులకు అందజేశారు. జిల్లాలోని 12 మండలాల్లో రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 23,858 మంది రైతులకు 41,407 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు తేల్చారు.

వీరిలో తొలివిడత కింద 3,638 మంది రైతులకు రూ.4.61 కోట్లు ఇచ్చిన సర్కారు, మిగిలిన 20,160 మందికి ఇవ్వాల్సిన రూ 36.69 కోట్లకుపైగా నిధులను విడుదల చేయడం లేదు. జనగామ మండలంలో 4,919 మంది రైతులకు రూ.9.15 కోట్లు, నర్మెట్టలో 5,160 మందికి రూ.8.68 కోట్లు, తరిగొప్పులలో 1,027 మందికి రూ. 1.18 కోట్లు, కొడకండ్లలో 2,677 మందికి రూ.3.48 కోట్లు, దేవరుప్పులలో 266 మందికి రూ.22.95 లక్షలు, పాలకుర్తి మండలంలో 168 మందికి రూ. 19.82 లక్షలు, స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో 310 మందికి రూ.31.13 లక్షలు, చిల్పూరు మండలంలో 641 మందికి రూ.66.53 లక్షలు ఇవ్వాల్సి ఉంది.

అలాగే జఫర్‌‌‌‌గఢ్‌‌‌‌ మండలంలో 216 మంది రైతులకు రూ.28.86 లక్షలు, బచ్చన్నపేటలో 5,890 మందికి రూ.13.88 కోట్లు, లింగాల ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో 305 మందికి రూ.43.16 లక్షలు, రఘునాథపల్లి మండలంలో 2,279 మంది రైతులకు పరిహారం కింద రూ. 2.62 కోట్లు రిలీజ్‌‌‌‌ చేయాల్సి ఉంది. పరిహారం మంజూరు చేయాలని రైతులు ఎన్నిసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఇదిగో.. అదిగో.. అంటూ దాట వేస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి పంట పరిహారాన్ని మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇంతవరకు ఒక్క రూపాయి రాలే 


నాకు ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరం దొడ్డు రకం, మరో ఎకరంలో సన్నొడ్లు సాగు చేసిన. పంట బాగానే వచ్చిందని సంబురపడే టైంలో అకాల వానలు ఆగం జేసినయ్. వ్యవసాయ అధికారులు వచ్చి రాసుకుని పోయిన్రు. ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పిన్రు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలే. ఇప్పటికైనా పరిహారం పైసలు ఇప్పించాలె.  

- గొడిశాల రామచంద్రు, బాధిత రైతు, కోడూరు